కలం, వెబ్ డెస్క్ : పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో (LPU Protest) శనివారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలికల హాస్టల్‌లో ఉన్న ఒక విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో నిర్ధారణ లేని వదంతులు వ్యాపించడంతో సుమారు 2,000 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో రగిలిపోయిన విద్యార్థులు వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, కిటికీ అద్దాలు పగులగొట్టి, కొన్నిచోట్ల నిప్పు పెట్టడంతో క్యాంపస్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే నిరసనకారులు జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని దిగ్బంధించి రాకపోకలను స్తంభింపజేశారు. సమాచారం అందుకున్న కపుర్తలా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనపై ఎస్ఎస్‌పీ గౌరవ్ తూరా స్పందిస్తూ.. క్యాంపస్‌లో అత్యాచారం లేదా ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు గానీ, రుజువులు గానీ లభించలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం సోషల్ మీడియాలో ప్రచారమైన అబద్ధపు ప్రచారమేనని తేల్చారు.
మరోవైపు వర్సిటీ యాజమాన్యం కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు కావాలని ఇటువంటి పుకార్లను ప్రచారం చేశారని ఎల్‌పీయూ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులు , తల్లిదండ్రులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : గులాబీ మయమైన నెక్లెస్ రోడ్: క్యాన్సర్‌పై పోరులో ‘ పింక్ పవర్’ రన్!
Follow Us On: X(Twitter)

