కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని షాద్‌నగర్-పరిగి ప్రధాన రహదారిపై సైదుపల్లి, రావులపల్లి రైతులు గురువారం ధర్నా (Farmers Protest) చేపట్టారు. తమ గ్రామాల్లోని పలు సర్వే నంబర్ల భూముల రిజిస్టేషన్లను అధికారులు అకస్మాత్తుగా హోల్డ్‌లో పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి తాము భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే ప్రాజెక్టుకు అవసరమైన భూములను మాత్రమే సేకరించి, మిగిలిన భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న ఆంక్షలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
అధికారుల ఏకపక్ష వైఖరిపై ఆగ్రహం
ధర్నాలో పాల్గొన్న రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గ్రామసభ నిర్వహించకుండా, భూసేకరణకు సంబంధించి రైతులకు ఎలాంటి ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా భూములను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ, రిజిస్టేషన్లు చేయకుండా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అత్యవసరాల కోసం అమ్ముకోలేక ఇబ్బందులు
రిజిస్ట్రేషన్లపై ఉన్న ఆంక్షల కారణంగా పిల్లల వివాహాలు, వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర అవసరాల కోసం తమ సొంత భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న ఆంక్షలను తక్షణమే తొలగించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

