కలం, వెబ్ డెస్క్: ఏపీలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైఎస్సార్‌సీపీ నిరసన (YSRCP Protest)కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్పోర్ట్స్ కోటా నియామకాలపై అక్రమాలు జరిగాయని తీవ్రంగా ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు.. శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే రెడ్ సర్కిల్ వద్ద పోలీసులు వారికి అడ్డుకున్నారు.
బారికేడ్లను దాటి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని నిరోధించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జగరడంతో పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు. ఈ క్రమంలోనే ఓ వైసీపీ కార్యకర్త స్పృహతప్పి పడిపోయాడు.
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులను అరెస్ట్ చేశారు. జోగిరమేష్ మాట్లాడుతూ.. శాంతియుతంగా ధర్నా చేస్తే అడ్డకుంటారా? అని ప్రశ్నించారు. మల్లాది విష్ణు సైతం పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీస్ యాక్టు వైసీపీ వాళ్ళకే వర్తిస్తుందా? టీడీపీ జనసేన పార్టీ నాయకులకు వర్తించదా? అని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ధర్నా చేయడంతో విజయవాడలో పోలీసులు హైఅలర్ట్ గా ఉన్నారు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. గుంటూరు నుంచి విజయవాడ వచ్చే తాడేపల్లి దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. శాప్ ఆఫీసుకు మూడు వైపులా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

