కలం, కరీంనగర్ బ్యూరో: దసరా నాటికి పెద్దపల్లి (Peddapalli) ఆర్టీసీ డిపో ప్రారంభించబోతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే, విప్ చింతకుంట విజయరమణ రావు అన్నారు. తుర్కల మద్దికుంట గ్రామంలో పెద్దపల్లి నుంచి చొప్పదండికి వెళ్లే నూతన బస్సును స్థానిక నాయకులతో కలిసి విప్ జెండా ఊపి ప్రారంభించారు. తుర్కలమద్దికుంట నుంచి జూలపల్లి వరకు బస్సులో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించారు. ఈ సందర్బంగా విప్ విజయరమణ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ చిత్రపటంలో పెద్దపల్లి బస్ డిపో పేరును చేర్చే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏనాడు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు.
అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు..
పెద్దపల్లిలో ఏర్పాటు కాబోతున్న కొత్త బస్ డిపో వలన హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, జిల్లాలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు విప్ విజయరమణ రావు వివరించారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాలు కురవడం వలన సమృద్ధిగా పంటలు పండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి, ఉప సర్పంచి, సింగిల్ విండో ఛైర్మన్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

