కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక చారిత్రక ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాట చరిత్రను ఎంత దాచాలని చూసినా అది దాచేస్తే దాగేది కాదని స్పష్టం చేశారు. త్యాగాలతో కూడుకున్న ఈ నేల ఘన చరిత్రను వర్తమాన పాఠశాల విద్యార్థులకు, యువత గుండెలకు చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటే, తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దమనకాండకు ఎదురొడ్డి, అనేక ప్రాణత్యాగాల తర్వాత 1948 సెప్టెంబర్ 17న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసుకున్నారని గుర్తుచేశారు. ఈ స్వేచ్ఛ ఊరికే రాలేదని, అది కేవలం ఒక జెండా మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల కష్టం, భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు వేలాది మంది చేసిన ప్రాణత్యాగ ఫలితమని తెలిపారు
ఈ సందర్భంగా చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ నిజాం పాలనలో ‘వందేమాతరం’ అన్నందుకు జైలుపాలు చేశారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. పత్రికలు పెట్టే స్వేచ్ఛ కూడా లేని ఆ రోజుల్లో రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ నేతృత్వంలో తెలంగాణ ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం అరాచకాలపై దాశరథి, యాదగిరి వంటి కవులు గళమెత్తితే వారిని జైల్లో పెట్టడమో లేదా హత్య చేయడమో చేశారని చరిత్ర చెబుతోందన్నారు. నిర్మల్ ప్రాంతంలో రాంజీ గోండ్ నిజాం సైన్యంపై చేసిన పోరాటానికి గాను 1857లోనే 1000 మంది వీరులను ఒకే చెట్టుకు ఉరితీశారని, ‘జల్ జమీన్ జంగల్’ నినాదంతో కొమరం భీమ్, అలాగే భూమి కోసం భుక్తి కోసం దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, బందగీ, పవార్, గండన్న వంటి మహానీయులు నేలకొరిగిన తీరును కొనియాడారు.
వీరులు ఆనాడు కలలు కని ఊహించిన ఆ స్వేచ్ఛను నేడు మనమంతా అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలకు కేవలం పుస్తకాల చదువు, ఉద్యోగాలు మాత్రమే కాకుండా దేశభక్తిని, ఈ నేల వీరుల పోరాట చరిత్రను నూరిపోయ్యాలని పిలుపునిచ్చారు. చరిత్ర లేకుండా వర్తమానం, భవిష్యత్తు ఉండవని, ఈ పోరాటం విలీనమా, విమోచనమా అనే అనవసర చర్చలకు తావులేకుండా ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిన “విముక్తి రోజే” అని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

