కలం, వెబ్ డెస్క్: స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ఒకే వేదికపై సందడి చేశారు. సిద్ధిపేట జిల్లాలోని కొండపాకలో ఉన్న శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్‌ను శనివారం వీరిద్దరూ సందర్శించారు. అక్కడ గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల కోసం గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు, విజయ్ దేవరకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను పరామర్శించి మాట్లాడారు. పిల్లలను, వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవల గురించి అక్కడి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హరీశ్ రావుపై విజయ్ ప్రశంసలు..
గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… హరీశ్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో హరీశ్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆస్పత్రికి భూ కేటాయింపులు జరిగినట్లు వివరించారు. అలాగే ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన ఎంతో సహకరించారని పేర్కొన్నారు. హరీశ్ రావు చొరవతో చేపట్టిన పనులు, తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే నేడు ఎంతోమంది చిన్నారులు ప్రాణాలతో ఉన్నారని కొనియాడారు. ఇలా చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందించారు. హరీశ్ రావు సిద్దిపేట్ కా షేర్ అంటూ సభను ఉత్సాహపరిచారు.
ఇక హరీశ్ రావు ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారుల ప్రాణాలు కాపాడి ఈ డాక్టర్లు ఎంతో మంది కుటుంబసభ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆస్పత్రుల్లో 6 వేల సర్జరీలు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ ఎంతో నిబద్ధతతో తన సొంత డబ్బులతో పాటు దాతల సహకారంతో ఆస్పత్రిని విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. విజయ్ దేవరకొండ అందరికీ అభిమాన నాయకుడిగా, నటుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించారని ప్రశంసించారు.

