కలం, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) తన తాజా చిత్రం ‘అప్పా కుట్టి’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘నాన్న కుట్టి’ పేరుతో ఈ నెల 27 నుంచి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ ఆంటోనీ వినూత్నంగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల సాధారణ ప్రయాణికుడిలా రైలులోని జనరల్ బోగీలో ప్రయాణించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్‌లోనూ విజయ్ ఆంటోనీ సందడి చేశారు. హీరోయిన్ ప్రీతి అస్రానితో కలిసి నగర వీధుల్లో పర్యటిస్తూ సినిమా ప్రమోషన్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మిర్చి బండి వద్దకు వెళ్లిన ఆయన స్వయంగా బజ్జీలు వేశారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన వారికి తన చేతులతోనే బజ్జీలు అందించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

