కలం, వెబ్ డెస్క్ : తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు (TFPC Elections) ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సినీ రంగ ప్రతినిధులు, నిర్మాతలు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మండలి అధ్యక్ష పదవికి ప్రముఖ సీనియర్ నిర్మాత సి. కల్యాణ్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన కార్యవర్గ పదవుల కోసం “మన ప్యానెల్”, “ప్రోగ్రెసివ్ ప్యానెల్” మధ్య పోటీ నెలకొంది. బరిలో డివివి దానయ్య, మైత్రీ రవి, స్రవంతి రవికిషోర్, వైవిఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, వంశీ నందిపాటి వంటి ప్రముఖ నిర్మాతలు నిలిచారు.
ఉదయం నుంచే పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓట్లను వేశారు. పోసాని కృష్ణమురళి, శివకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వడ్డే నవీన్, జీవిత, సితార నాగవంశీ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, దాసరి కిరణ్ కుమార్, ఆర్. నారాయణ మూర్తి, కాదంబరి కిరణ్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు 322 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి, సాయంత్రం 4 గంటల తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నారు.

