కలం, వెబ్‌డెస్క్: ఇండోనేషియా (Indonesia)లోని ప్రధాన ఎయిర్ పోర్ట్ సమీపంలో అనాక్ క్రాకటోవా అనే అగ్ని పర్వతం (Anak Krakatoa Volcano) బద్దలైంది. దీంతో దేశం నుంచి వందలాది విమానాలు రద్దయ్యాయి. సుమారు పది వేల మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఈ అగ్ని పర్వత విస్ఫోటనం కారణంగా జకార్తాలోని సూక్ణో-హట్టా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గగనతలంలో బూడిద నిండిపోవడంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. గత శుక్రవారం కూడా పలు విమానాల సర్వీసులపై ప్రభావం పడిందని స్థానిక అధికారులు వెల్లడించారు.
జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుందా జలసంధిలో ఈ అగ్ని పర్వతం ఉంటుంది. స్థానికంగా అగ్ని పర్వత విస్ఫోటనం తీవ్ర ప్రభావం చూపుతున్నా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. గాలిలో బూడిద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రయాణికుల విమానాల రద్దు గడువును మధ్యాహ్నం 1.30 గంటల వరకు పొడిగించారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్యంతో శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

