కొత్త రేషన్ కార్డులతో ప్రజలకు అన్ని విధాలుగా మేలు: వేముల వీరేశం

కలం, నిర్మల్: జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్ సమీపంలోని సాగర్ కన్వెన్షన్‌ హల్ లో శనివారం సాయంత్రం నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) పాల్గొని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉన్నతమైన లక్ష్యంతో ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డుల రూపకల్పన జరిగిందని తెలిపారు.

జిల్లాలో మొత్తం 2,49,313 నూతన డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ విప్ వేముల వీరేశం వివరించారు. పారదర్శకమైన పాలన అందిస్తూ, రేషన్ కార్డును కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా, ప్రభుత్వ పథకాలన్నింటికీ ఒక నమ్మకమైన గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి ప్రతీ ఇంట్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేస్తోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సులభతరం చేసిందని పేర్కొన్నారు.

రేషన్ బియ్యాన్ని బయట అమ్ముకోవద్దు: ఏలేటి

ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. రేషన్ బియ్యాన్ని బయట అమ్ముకోకూడదని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా పేదలకు లబ్ది చేకూరుతుందన్నారు. రేషన్ బియ్యం ప్రజలందరికీ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

కార్డుల పంపిణీతో ప్రజలకు మేలు: పవార్

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. ప్రజలకు అందించే రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని గుర్తు చేశారు. రేషన్ కార్డులు ఎన్నో ప్రభుత్వ పథకాలకు ప్రామాణికమని చెప్పారు. నూతన రేషన్ కార్డుల పంపిణీతో ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డిఆర్డిఓ విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి రాజేందర్, కడ్తాల్ గ్రామ సర్పంచ్ గుర్రం రాము, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>