ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి : బీర్ల అయిలయ్య

కలం, ఆలేరు/ యాదగిరిగుట్ట : అరవింద్ నీచపు రాజకీయ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియదా అని బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) ప్రశ్నించారు. జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఆరవింద్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. ఒక బీసీ నాయకుడిపై సభ్యత, సంస్కారం లేకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

“మీ నానమ్మ బీడీలు చేసి మిమ్మల్ని సాదిందని మీ నాన్న డీఎస్ ఇంటర్వ్యూలో చెప్పారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారు నేడు వేల కోట్ల రూపాయల అధిపతులు ఎలా అయ్యారని, కోట్ల రూపాయల అద్దెలు వచ్చే ఆస్తులు ఎలా సంపాదింరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అరవింద్ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

గతంలో డీఎస్ పీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో బీ-ఫామ్‌లకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్న చరిత్ర కాంగ్రెస్ నాయకులకు తెలుసన్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, అదే ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధిగా ఉన్న ఆరవింద్ ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో డీఎస్ నిజామాబాద్ నుంచి పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారని, ప్రస్తుతం అదే ప్రాంతానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకులను రాజకీయాలకు అతీతంగా గౌరవించడం విజ్ఞతకు నిదర్శనమన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు వ్యక్తిగత దూషణలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహించడం ఏ సంస్కారమని ప్రశ్నించారు. తాము కూడా వారి లాగా వ్యక్తిగతంగా మాట్లాడితే బీజేపీ నాయకులు రోడ్ల మీద తిరగగలరా అని అన్నారు.

అహంకారం నెత్తికెక్కి ఇష్టానుసారంగా మాట్లాడితే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చరిత్రను పరిశీలించాలని బీర్ల సూచించారు. అహంకారంతో వ్యవహరించిన అనేక మంది నాయకులు, నియంతలు చివరకు ప్రజల తిరస్కారానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు ఎంపీ ఆరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీర్ల (Beerla Ilaiah) డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>