కలం, నాగర్ కర్నూల్: సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి (G Chinna Reddy) అన్నారు. ఆరు గ్యారంటీలను దశల వారీగా అమలు చేస్తూ, అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా ఫారెస్ట్ అధికారి రేవంత్ చంద్ర, ఎఫ్డీవో చంద్ర ప్రకాష్, అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవ సహాయం పాల్గొన్నారు.
అందరికీ సంపద పంపిణీ..
మొదట చిన్నారెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాలపై ప్రగతి నివేదికను చదివి వినిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయంతో అయితే ఏర్పడిందో ఆ దిశగా స్వేచ్ఛ, సామాజిక న్యాయం సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా ప్రజలకు సంపద పంపిణీ జరగాలనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకోవాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించడం, పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, రైతులు, యువతకు అండగా నిలవడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర ప్రగతి మరింత వేగవంతమవుతుందన్నారు. అనంతరం స్వాతంత్ర సమర యోధులు స్వర్గీయ సినిమా శేఖరయ్య సతీమణి అంబటి లీలావతిని చిన్నారెడ్డి శాలువాతో సత్కరించారు.

