కలం, వరంగల్ బ్యూరో : పోగొట్టుకున్న రూ.16 లక్షల విలువగల 100 గ్రాముల బంగారు ఆభరణాలను వేలేరు పోలీసులు (Velair Police) తిరిగి బాధితులకు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రానికి చెందిన గంజి రమేశ్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మధ్యాహ్నం లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో, మినరల్ వాటర్ ట్యాంకులో నింపుకునేందుకు వాటర్ ట్యాంక్ తీస్తున్న సమయంలో.. కారు డిక్కీలో ఉన్న బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగు కిందపడిపోయింది.
ఇది గమనించకుండా కారులో జాతరకు వెళ్లిపోయిన బాధితుడు, తిరుగు ప్రయాణంలో తన కారు డిక్కీలో బ్యాగు కనిపించకపోయేసరికి కంగారుపడ్డాడు. ఇంట్లో కూడా వెతికినప్పటికీ కనిపించకపోయేసరికి, ఎక్కడో రోడ్డు మార్గమధ్యలో పడిపోయినట్లుగా అనుమానించారు. కాగా బాధితుడు ఈ రోజు ఉదయం వేలేరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన ఎస్సై సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానిక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు.
సదరు రోడ్డుపై పడిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును అక్కడే ఉన్న ఓ వ్యాపారి తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు అతని నుండి బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకొని బాధిత దంపతులకు ఎస్సై అందజేశారు. పోయిన బ్యాగును కనిపెట్టి అందజేసిన వేలేరు పోలీసులకు (Velair Police) బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.


