కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత చిత్రపటానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్యవైశ్య ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్య వైశ్యులు సమాజంలో వివిధ రకాల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఆర్యవైశ్యులు మహత్తరమైన సేవా కార్యక్రమాలతో పేద కుటుంబాలకు సహాయం చేస్తుండడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లోనూ ఆర్యవైశ్యులకు మరింత అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంతో పాటు వైశ్య భవనం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శిస్తానని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్యులకు వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ఆర్యవైశ్య ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఆర్యవైశ్యుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాము విస్తృతంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు సహాయం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ కే మహేశ్వర్, కార్పొరేటర్లు వంగాల పవన్ కుమార్, కొలిపాక రమ్య, శ్రీనివాస్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకులు చిదుర సురేష్, కటకం వెంకటరమణ, పలువురు అధికారులు, ఆర్యవైశ్యులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

