కలం, చంద్రుగొండ: సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తూ, నిరంతరం ప్రజాసేవకే అంకితమైన వాసవి క్లబ్ చంద్రుగొండ జోన్ స్థాయిలో ఘన విజయం సాధించి అరుదైన పురస్కారాలను కైవసం చేసుకుంది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ (Vasavi Club), డిస్ట్రిక్ట్ V106A, రీజియన్ III, జోన్ I ఆధ్వర్యంలో సుజాతనగర్లో నిర్వహించిన జోన్ సోషల్ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ క్లబ్‌కు ప్రతిష్ఠాత్మకమైన “సూపర్ బెస్ట్ క్లబ్” , క్లబ్ అధ్యక్షులు కుకడపు నాగేశ్వరరావును “సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్” అవార్డులు వరించాయి.
జోన్ చైర్మన్ శీమకుర్తి నాగరాజ్ తరుణ్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, గెల్లా కృష్ణారావు పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రుగొండ క్లబ్ చేపట్టిన పలు సామాజిక, ఉచిత సేవా కార్యక్రమాలను జోన్ చైర్మన్ నాగరాజ్ తరుణ్ సభకు వివరించి, క్లబ్ అందిస్తున్న సేవలను విస్త్రతంగా ప్రశంసించారు. విశేషించి, క్లబ్ ప్రెసిడెంట్ కుకడపు నాగేశ్వరరావు సేవలను, ఆయన నాయకత్వ పటిమను ప్రత్యేకంగా కొనియాడారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా క్లబ్ ప్రతినిధులు ఈ పురస్కారాలను అందుకోగా, అక్కడ ఉన్న సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ… సేవా కార్యక్రమాలకు లభించిన ఈ అరుదైన గుర్తింపు తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో చంద్రుగొండ పరిసర ప్రాంతాల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సులో ముందంజలో ఉంటామని ఆకాంక్షించారు.

