కలం, వలిగొండ: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో వలిగొండ (Valigonda) శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బెలిదె అన్విత, తొమ్మిదో తరగతి విద్యార్థి బెలిదె వర్థన్లు పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. వారి ప్రతిభకు గుర్తింపుగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చేతుల మీదుగా మెమొంటోలు, సర్టిఫికెట్లు అందుకున్నారు.
విద్యార్థుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకోజు భాస్కర్, ఉపాధ్యాయులు కొండపర్తి నవీన్, పోలేపాక నాగేందర్, సైదారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ విజయలక్ష్మి తదితరులు అభినందించారు. విద్యార్థుల ప్రతిభ పాఠశాలకు, వలిగొండ మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మక కార్యక్రమాలలోనూ రాణించడం అభినందనీయమని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

