కోదాడ నిరుద్యోగులకు మంత్రి ఉత్తమ్ గుడ్‌న్యూస్

కలం, సూర్యాపేట : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కోదాడ పట్టణంలో భారీ ‘మెగా జాబ్ మేళా’ (Kodad Mega Job Mela) ను నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో హుజూర్ నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతం కావడంతో, ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరింత భారీ ఎత్తున కోదాడలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సుమారు 300 ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నాయని తెలిపారు. ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయి. అలాగే ఫార్మా రంగం నుంచి డాక్టర్ రెడ్డీస్, దివీస్, అరబిందో, హెటెరో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్‌తో పాటు ఎంఆర్ఎఫ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్‌కార్ట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పేటీఎం సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి.

ఉమ్మడి జిల్లా పరిధిలోని సిమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమల్లోనూ స్థానిక యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జాబ్ మేళా రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందస్తుగా [kodadmegajobmela.com](https://kodadmegajobmela.com) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పరిమిత స్లాట్లు మాత్రమే ఉన్నందున ముందస్తు నమోదు చేసుకున్న వారికే ఇంటర్వ్యూ సమయాన్ని కేటాయిస్తామన్నారు.

ఈ జాబ్ మేళాకు దాదాపు 15,000 నుండి 20,000 మంది నిరుద్యోగులు హాజరవుతారని అంచనా వేస్తుండగా, ఇప్పటికే 12,000కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని పరిశీలించేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకానున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే. నరసింహ, ఏఎంసీ చైర్మన్ వేణారెడ్డి, సర్వోత్తమ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>