కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కొత్త స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (V Hanumantha Rao) కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జికి విద్యా శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సంగం లక్ష్మీబాయి పేరు పెట్టడం వలన ప్రభుత్వానికి ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. ప్రస్తుతం విద్యా శాఖను కూడా ముఖ్యమంత్రే చూస్తున్నందున.. సానుకూల నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు.
మంత్రిగా, ఎంపీగా సేవలు..
సంగం లక్ష్మీబాయి తెలంగాణ ప్రాంత కీలక నేతల్లో ఒకరని వి.హనుమంతరావు లేఖలో వివరించారు. ‘1952లో అల్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బూర్గుల ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు. మెదక్ ఎంపీగా మూడు సార్లు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ నుంచి పార్లమెంటుకి ఎన్నికైన తొలి మహిళ కూడా లక్ష్మీబాయినే. సైదాబాద్‌లో ఇందిరా సేవా సదన్ పేరిట విద్యా సంస్థ ఏర్పాటు చేశారు. తెలంగాణలో జరిగిన భూదాన్ ఉద్యమంలో కూడా ఆమె చురుకైన పాత్ర పోషించి, పేదలకు భూములు దక్కేలా చేశారు’ అని వీహెచ్ తెలిపారు. అలాంటి గొప్ప నాయకురాలి పేరును స్టీల్ బ్రిడ్జికి పెట్టాలని సీఎంను కోరారు.

