కలం, ఖమ్మం బ్యూరో: వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వి.హనుమంతరావు (వీహెచ్) మరోసారి నిరూపించారు. 80 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్పులు చూసి అక్కడున్నవారంతా ‘అదుర్స్’ అనాల్సిందే అన్నట్లుగా ఆకట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని చెరుకూరి వారి మామిడితోటలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమం వీ హనుమంతరావు (V Hanumantha Rao) హుషారుతో మరింత సందడిగా మారింది.
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేడుకలు, ఆటపాటలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వీహెచ్.. వేదికపై యాంకర్ తో కలిసి ఉర్రూతలూగించేలా స్టెప్పులేసి అదరగొట్టారు. సీనియర్ నేత ఇంతటి ఎనర్జీతో డ్యాన్స్ చేయడం చూసిన కులబాంధవులు, స్థానికులు కేరింతలు కొడుతూ, చప్పట్లతో మామిడితోటను హోరెత్తించారు.
అంతకుముందు, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ వనసమారాధనలో తొలుత కార్తీక మాస సంప్రదాయాన్ని అనుసరించి ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కులబాంధవులంతా ఆత్మీయంగా కలుసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. రోజంతా ఆటపాటలు, వీహెచ్ సరదా డ్యాన్స్‌తో వనభోజనాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.

