కలం, వెబ్ డెస్క్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గం తవ్వకాలలో అనుసరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) సమగ్రంగా రూపొందించిన నివేదికను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్జీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ అందించారు. ఈ సందర్భంగా సంస్థను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనుల పురోగతి పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో బాగమైన మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల పునరుద్ధరణకుగాను ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో భూపరిశోధన (సాయిల్ టెస్ట్) భాగస్వామ్యం కావాలన్నారు. శుక్రవారం సచివాలయంలో ఈ మేరకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ రమేష్ బాబు, సొరంగ మార్గం తవ్వకాల నిపుణుడు పరిక్షిత్ మెహ్రా, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ నివేదిక పై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం తవ్వకాల సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై ఎన్జీఆర్ఐతో సమగ్రంగా సర్వే నిర్వహినట్లు తెలిపారు. తవ్వకాల సమయంలో ముందస్తుగా ప్రమాదవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఈ సంస్థ సీస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టొమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వివరించారు. సొరంగ మార్గం తవ్వకాలలో కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రాధాన్యతాంశంగా పెట్టుకుందన్నారు. అందుకు తగినట్లు గానే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల మార్గదర్శనానికి అనుగుణంగానే సొరంగ మార్గం తవ్వకాలు ఉంటాయని చెప్పారు.
ఈ నివేదికలో స్ట్రెస్‌జోన్‌లు, నీటి ఊరటలతో పాటు సొరంగమార్గంపై భాగం తదితర అంశాలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు సమగ్రంగా అధ్యయనం జరిపారని ఆయన తెలిపారు. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ పనులపై ఆయన మాట్లాడుతూ వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ లోడర్లు, భారీ డంపర్ల తోడ్పాటుతో ఇప్పటివరకు 151.50 మీటర్ల తవ్వకం పూర్తి అయిందన్నారు. దేశీయ, అంతర్జాతీయంగా సంస్థల నుండి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాంగాన్ని సమీకరించి రెండు వైపులా నెలకు 200 మీటర్ల వరకు తవ్వకాలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.

