కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో గిరిజన రక్షణ చట్టాలను తుంగలో తొక్కుతూ దారుణమైన భూస్కాం వెలుగుచూసింది. పేద గిరిజన రైతు బతికుండగానే అతడిని రికార్డుల్లో చంపేసి, ఐదెకరాల అసైన్డ్ భూమిని అధికారులు గిరిజనేతరులకు కట్టబెట్టారు. పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన మళ్ళ సత్యం (73) అనే వృద్ధ రైతుకు 5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమిని కాజేయడానికి కొందరు దళారులు, అధికారులు కలిసి పెద్ద స్కెచ్ వేశారు. సత్యం 2018లోనే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఆ తర్వాత అతనికి భార్యాపిల్లలు ఎవరూ లేరని అబద్ధాలు చెప్పారు. సదరు కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని మందలపల్లికి చెందిన నామ పుష్పవతిని ఏకైక వారసురాలిగా చూపిస్తూ తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్ పుట్టించారు.
ఈ ఫోర్జరీ పత్రాల ఆధారంగా 2026 మే నెలలో ఆ ఐదెకరాల భూమిని పుష్పవతి పేరుకు బదిలీ చేసేశారు. ఈ వ్యవహారంలో స్థానిక గ్రామపంచాయతీ అధికారి (జీపీఓ) అనంతలక్ష్మి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో తన ఓటు పత్రం రాకపోవడంతో అనుమానం వచ్చిన సత్యం అధికారులను నిలదీశాడు. రికార్డుల్లో తాను ఆరేళ్ల క్రితమే చనిపోయినట్లు ఉండటం చూసి విస్తుపోయాడు. “లంచాలకు కక్కుర్తి పడి నన్ను బతికుండగానే చంపేశారు. దీనివల్ల నా పింఛన్, రేషన్, ఓటు హక్కు అన్నీ కోల్పోయాను. ఇప్పుడు నేను బతికే ఉన్నానని ఎలా నిరూపించుకోవాలి?” అంటూ బాధితుడు విలపించాడు.
ఈ అక్రమ భూ బదలాయింపుపై స్థానిక ఎమ్మార్వో రామ్ నరేశ్ స్పందిస్తూ.. జీపీఓ అనంతలక్ష్మి తప్పుడు వివరాలు ఇవ్వడమే కాకుండా, తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఈ దారుణానికి ఒడిగట్టిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించామని, ఫోర్జరీకి పాల్పడిన జీపీఓపై పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. బతికున్న మనిషిని చంపేసి భూములు రాసేసుకునే స్థాయికి అవినీతి దిగజారడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

