కలం, వెబ్ డెస్క్: టీమిండియా తీవ్ర డౌన్‌ఫాల్‌ను చూస్తోంది. వరుసగా ఐదు టీ20ల్లో భారత్ అత్యంత దారుణంగా ఓటమిని రుచిచూసింది. ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్ స్వీప్‌ను చవిచూసిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా అదే పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. దీంతో భారత్ ఓటములపై బీసీసీఐ (BCCI) దృష్టి పడింది. ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది పనితీరును కూడా సమీక్షించేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పదవి 2027 వరకు ఉన్నప్పటికీ, ఇటీవల ఫలితాల నేపథ్యంలో ఆయన పనితీరు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్ వర్షంతో ఫలితం లేకుండా ముగిసింది.
రెండో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. మూడో మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి 125 పరుగుల భారీ తేడాతో పరాజయం చవిచూసింది. బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో కూడా తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇది టీమిండియాకు వరుసగా రెండో టీ20 సిరీస్ ఓటమి. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ కోల్పోయింది.
అదే సమయంలో ఐర్లాండ్‌పై భారత జట్టుకు ఇదే తొలి సిరీస్ పరాజయం కూడా కావడం గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించిన తర్వాత ఈ రెండు సిరీస్ ఓటములు రావడం కూడా చర్చనీయాంశమైంది. బ్రిస్టల్ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేసి పోరాడాడు.
కానీ మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అనంతరం ఇంగ్లండ్ కేవలం 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 35 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఫిల్ సాల్ట్ 42 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తలో రెండు వికెట్లు తీశారు.

