కలం, స్పోర్ట్స్: అబుదాబిలో ఇద్దరు స్టార్ ఫైటర్ల మధ్య వివాదం ఘర్షణకు (Usman-Merab Fight) దారితీసింది. మాజీ యూఎఫ్‌సీ బాంటమ్‌వెయిట్ ఛాంపియన్ మెరాబ్ డ్వాలిష్విలిపై పీఎఫ్ఎల్ ఫైటర్ ఉస్మాన్ నూర్మగోమెడోవ్ దాడి చేశాడు. హోటల్ లాబీలో మెరాబ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా వెనుక నుంచి వచ్చి చెంపపై కొట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో మెరాబ్ ముఖానికి గాయాలై రక్తమోడింది. తనపై ఉస్మాన్, అతడి అనుచరులు గుంపుగా దాడి చేశారని మెరాబ్ ఆరోపించాడు. తాను, తన స్నేహితుడు మాత్రమే ఉన్నామని.. దాదాపు 20 మంది తమపై దాడి చేశారని తెలిపాడు. కిందపడిన తర్వాత కూడా తన్నారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై జార్జియా ఫైటర్ ఇలియా టొపూరియా కూడా తీవ్రంగా స్పందించాడు.
మరోవైపు యూఎఫ్‌సీ స్టార్ ఇస్లాం మఖచేవ్ ఉస్మాన్‌కు మద్దతుగా నిలిచాడు. గతంలో మెరాబ్ ఓ డాగేస్తానీ రెజ్లర్‌పై దాడి చేసి, అతడి తల్లిని అవమానించాడని గుర్తుచేశాడు. అప్పుడెందుకు మెరాబ్ను విమర్శించలేదని ప్రశ్నించాడు. నవంబర్ 11న జరిగిన ఈ ఘర్షణ (Usman-Merab Fight) పై అబుదాబి పోలీసులు స్పందించారు. బహిరంగ ప్రదేశంలో ఘటన జరగడం, వీడియోలో రికార్డు కావడంతో ఇరు వర్గాలను విచారణకు పిలిచినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. నవంబర్ 14న జరగనున్న ఆర్ఏఎఫ్ ఈవెంట్లో మెరాబ్ మార్లోన్ మోరేస్‌తో తలపడాల్సి ఉంది. ఈ ఘర్షణ అతడి పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

