పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: బాలు నాయక్

కలం, దేవరకొండ: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 339 మంది లబ్ధిదారులకు సుమారు రూ.2.14 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఇందులో 209 మందికి రూ.84 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 130 మంది ఆడబిడ్డలకు రూ.1.30 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ ద్వారా ఉచిత వైద్యం పొందుతున్న వారిలో దేవరకొండ నియోజకవర్గ ప్రజలే అధికంగా ఉన్నారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చికిత్స పొందే నిమ్స్‌లో నిరుపేదలు కూడా ఎల్ఓసీ ద్వారా పైసా ఖర్చు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు పొందవచ్చని వివరించారు. ఆర్థిక స్థోమత లేని పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రానున్న రోజుల్లో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని, నీటిని పొదుపుగా వాడుతూ తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తరఫున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవరకొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించడమే తన జీవిత ఆశయమని బాలు నాయక్ స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి సాగునీరు అందించి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల తరహాలో దేవరకొండను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఆలంపల్లి నరసింహ, హనుమంతు వెంకటేష్ గౌడ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>