కలం, వెబ్ డెస్క్ : నిర్బంధ కార్మిక పద్ధతుల ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమయ్యారనే కారణంతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలపై అదనపు పన్నులు విధించాలని అమెరికా ప్రతిపాదించింది (US Proposes Tariffs). ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) ఒక ప్రకటన విడుదల చేసింది. సెక్షన్ 301 దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ పన్నుల విధింపును ప్రతిపాదించారు. నిర్బంధ కార్మికుల ద్వారా ఉత్పత్తి చేసే వస్తువుల దిగుమతులపై నిషేధాన్ని సరిగ్గా అమలు చేయని కారణంగా అమెరికా వాణిజ్యానికి నష్టం వాటిల్లుతోందని యూఎస్‌టీఆర్ స్పష్టం చేసింది.
ఈ నివేదిక ప్రకారం, తగిన చట్టాలు లేదా నిబంధనలు లేని భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి 54 దేశాల ఉత్పత్తులపై 12.5 శాతం అదనపు పన్ను విధించనున్నారు. అలాగే పాక్షిక నిబంధనలు అమలు చేస్తున్న లేదా ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్న కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్, పాకిస్తాన్, బ్రిటన్, ఇండోనేషియా వంటి దేశాలపై 10 శాతం అదనపు పన్ను ప్రతిపాదించారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలోనే వాషింగ్టన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ పన్నుల విధింపుపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

