కలం, తెలంగాణ బ్యూరో: నిషేధిత భూముల జాబితా (22ఏ) విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న బీఆర్ఎస్‌ను ధరణి పేరుతో జరిగిన భూలావాదేవీలు వెంటాడుతున్నాయి. ధరణి వచ్చాక అనేక అక్రమాలు జరిగాయని, నిషేధిత జాబితాలోని భూములను పట్టా భూములుగా మార్చారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిపించిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధరణి అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీడర్లు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరుల పేర్లను బయటపెట్టారు. వాళ్లు ఏయే భూములను ఏ విధంగా పట్టాలుగా మార్చారో వివరించారు. అయితే అది ట్రైలర్ మాత్రమేనని, అసలు పిక్చర్ బుధవారం ఉంటుందని రెవెన్యూ డిపార్టుమెంట్‌లో చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా ఇంకొందరు బీఆర్ఎస్ లీడర్ల పేర్లను, వాళ్ల భూదందాలను వెల్లడిస్తారని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
భూభారతిపై నిందలు వేస్తూ 22ఏ అంశంలో ముఖ్యమంత్రిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో.. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో ఏయే ప్రభుత్వ/వివాదాస్పద భూములను బీఆర్ఎస్ నేతలు వాళ్ల పేర్లతో, కుటుంబ సభ్యుల పేర్లతో ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడిస్తారని సమాచారం అందుతోంది. మంత్రి ట్రైలర్ రిలీజ్ చేస్తే, ముఖ్యమంత్రి పిక్చర్ రిలీజ్ చేస్తారని రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.
అఫెన్స్ నుంచి డిఫెన్స్‌లోకి..
నిజానికి ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్(పీవోబీ) జాబితాలోని భూముల అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేసింది. సామాన్య ప్రజలు బాధితులుగా మారారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే చాలా భూములు 22ఏ లిస్టులోకి వెళ్లాయని హరీశ్‌రావు, కేటీఆర్ ఆరోపించారు. అయితే అసెంబ్లీలో 22ఏ అంశంపై శనివారం జరిగిన స్వల్పకాలిక చర్చలో బీఆర్ఎస్ ఆరోపణలకు మంత్రి పొంగులేటి వివరణ ఇచ్చారు. దాదాపు మూడున్నర గంటలకు పైగా మాట్లాడారు. ధరణి పేరుతో జరిగిన భూదందాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ లీడర్ల పేర్లనూ వెల్లడించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా బుధవారం జరిగే సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎప్పుడెప్పుడు? ఎక్కడెక్కడ? ఎంత భూమిని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేశారో, చేయించారో సీఎం వివరించే అవకాశమున్నది. కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాలనుకున్న అంశంతోనే బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని, అసెంబ్లీ వేదికగానే ఆ పార్టీని కార్నర్ చేయాలని సీఎం భావిస్తున్నారు.
భూ బాగోతం బట్టబయలు
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నిషేధిత జాబితాలోని భూములను బీఆర్ఎస్ నేతలు ఎప్పుడెప్పుడు? ఎక్కడెక్కడ? ఎంత? ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేశారో, చేయించారో అసెంబ్లీలో సీఎం వివరించే అవకాశమున్నది. రెవెన్యూ మంత్రి ట్రైలర్ రిలీజ్ చేస్తే, ముఖ్యమంత్రి పిక్చర్ రిలీజ్ చేస్తారని రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. సీఎం వెల్లడించే అంశాలతో బీఆర్ఎస్ లీడర్ల భూ బాగోతం బయటపడుతుందని, వారి అధికార దుర్వినియోగం ప్రజలకు తెలుస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సామన్యులకు రిలీఫ్
ఇంతకాలం 22ఏ విషయంలో గంభీర ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇకపై వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సామాన్యులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తున్నందున.. ఆ సామాన్యులకే రిలీఫ్ కలిగించేలా సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసే అవకాశమున్నదని తెలుస్తున్నది. ఏయే కాలనీల్లోని ఇండ్లను గత ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టిందో, ఎన్ని నెలల పాటు వారు ఇబ్బంది పడ్డారో వివరించి.. వారందరికీ ఉపశమనం కలిగేలా తీసుకునే నిర్ణయంపై ప్రకటన చేయవచ్చని తెలిసింది. ఇప్పటికే పదవుల విషయంలో కేసీఆర్ తనకు అనుకూలంగా ఉన్నవారికి, తన సామాజికవర్గానికి చెందినవారికి మేలు చేశారని పదేపదే విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్.. ఇప్పుడు ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఎలా ధారాదత్తం చేశారన్న అంశాన్ని కూడా వెల్లడించే అవకాశమున్నది.

