కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (Mahabubnagar DCCB) చైర్మన్ పదవికి ఆశావహులు క్యూ కట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పదవిని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేల సిఫారసులతో తీవ్ర ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పడినా, డీసీసీబీ ఒక్కటిగానే కొనసాగుతోంది. చైర్మన్ పదవి ఒక్కటే కావడంతో ఉమ్మడి జిల్లా ఆశావహులు పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
గతేడాది చివరలో పాలకవర్గాల గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా 9 డీసీసీబీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవీకాలం కూడా ముగిసింది. కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. 2024 ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి వనపర్తి జిల్లా నుంచి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన సుమారు ఏడాదికి పైగా పదవిలో కొనసాగారు.
నియోజకవర్గం నుంచి ఒకరు
ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 9 మంది అభ్యర్థులు డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మళ్లీ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన మరో మాజీ చైర్మన్ దివంగత వీరారెడ్డి కొడుకు, ప్రస్తుత నారాయణపేట డీసీసీ చీఫ్ ప్రశాంత్ రెడ్డి, జడ్చర్ల నుంచి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సోదరుడు జనంపల్లి దుష్యంత్ రెడ్డి, మక్తల్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి అనుచరుడు ప్రముఖ రియల్టర్ బాలకృష్ణారెడ్డి, దేవరకద్ర నుంచి దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత కేకే రెడ్డి మనవడు అరవింద్ రెడ్డి రేసులో ఉన్నారు. అరవింద్ రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నాగర్ కర్నూల్ నుంచి ప్రతాప్ గౌడ్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ నుంచి ప్రస్తుత డీసీసీ చీఫ్ సంజీవ్ ముదిరాజుకు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నట్టు చర్చలో ఉంది. చైర్మన్ నియామకంపై ఇటీవల జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర ఇంట్లో సుదీర్ఘ మంతనాలు జరిగినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లా నేతల అభిప్రాయాలను తీసుకున్న ఇన్ చార్జ్ మంత్రి ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం అందుతోంది .
రిజర్వేషన్లు ఉంటాయా..? అనే ఉత్కంఠ
ఉమ్మడి జిల్లాలోని 77 ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను, డీసీసీబీ చైర్మన్‌ను ఎన్నుకునే 15 మంది డైరెక్టర్లను అందరిని నామినేటెడ్ పదవులతోనే ప్రభుత్వం భర్తీ చేయాలని భావిస్తుంది. 15 మంది డైరెక్టర్లలో 12 మంది డైరెక్టర్లు మాత్రమే డీసీసీబీ చైర్మన్‌కు పోటీ చేసే అర్హత ఉంది. మిగతా ముగ్గురికి ఉండదు. కానీ ఓటు హక్కు ఉంటుంది. ఇటీవల జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సమక్షంలో డైరెక్టర్ల ఎంపిక దాదాపుగా పూర్తి కావచ్చిందని, అందులో ఒకరిని మాత్రమే సిఫార్సు చేస్తారని తెలుస్తోంది. రిజర్వేషన్లు ఉంటాయా ?లేవా ?అనేది ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తానికి పదవి కోసం పోటీ పడే ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

