కలం, స్పోర్ట్స్: అమెరికా వెళ్లి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడాలనుకున్న భారత రెజ్లర్లకు (Indian Wrestlers) భారీ షాక్ తగిలింది. తొమ్మిది మంది రెజ్లర్లకు అమెరికా వీసాలు నిరాకరించింది. దీంతో లాస్వేగాస్లో జరగనున్న అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వారు పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిణామాన్ని పునఃపరిశీలించాలంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అమెరికా ఎంబసీని కోరింది. అక్టోబర్ 7న న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారత బృందం వీసా అపాయింట్మెంట్లకు హాజరైంది. మొత్తం 24 మంది వెళ్లగా.. వారిలో 16 మంది రెజ్లర్లు ఉన్నారు. వీరిలో తొమ్మిది మందికి వీసాలు నిరాకరించారు.
ఇంటర్వ్యూల తర్వాత పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చేశారు. వీసా నిరాకరణకు ప్రధానంగా వారి వయసు, ఉద్యోగ పరిస్థితులు కారణంగా ఉన్నట్లు డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. పలువురు రెజ్లర్లు 20 ఏళ్లలోపే ఉన్నారని పేర్కొంది. ఇంకా వారు తమ క్రీడా కెరీర్ ప్రారంభ దశలో ఉండటంతో అధికారిక ఉద్యోగాల్లో లేరని వివరించింది. వీసా నిరాకరణకు గురైన వారిలో 2024 అండర్-17 ప్రపంచ ఛాంపియన్ నేహా సంగ్వాన్ కూడా ఉన్నారు. సమర్థ్ గజానన్ మ్హాకవే, ధీరజ్ కుమార్ మాలిక్, సచిన్ కుమార్, నిఖిల్, హర్దీప్, పర్వీన్, అహిల్యా శత్రుఘ్న్ షిండే, నేహా శర్మ కూడా ఉన్నారు.
అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 18 నుంచి 23 ఏళ్ల వయసున్న రెజ్లర్లు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో యువ రెజ్లర్లు ఇంకా ఉద్యోగాల్లో లేకపోవడం సహజమేనని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. వీసా నిరాకరణ నిర్ణయాలను మరోసారి పరిశీలించాలని అమెరికా ఎంబసీని కోరింది. మరోవైపు గురువారం వీసా అపాయింట్మెంట్లకు హాజరుకానున్న మిగతా రెజ్లర్ల విషయంలోనూ డబ్ల్యూఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది.
వారిలోనూ ఎక్కువ మంది 20 ఏళ్లలోపే ఉన్నారని, అధికారిక ఉద్యోగాలు లేవని తెలిపింది. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 12 నుంచి 18 వరకు లాస్వేగాస్లో జరగనుంది. తాజా వీసా పరిణామాల నేపథ్యంలో భారత రెజ్లర్ల పాల్గొనడంపై ఇప్పుడు తదుపరి నిర్ణయం అమెరికా ఎంబసీ పునఃపరిశీలనపై ఆధారపడి ఉంది.

