కలం, భైంసా: దశలవారీగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేయిస్తామని ముథోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో భైంసా మండలంలోని తిమ్మాపూర్, హంపొలి, దేగాం గ్రామాలకు సుమారు 150 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, వాటి పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పేదలకు తగిన సంఖ్యలో ఇళ్లు అందలేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో కొందరు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

