కలం, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా-భారత్ క్రీడా బంధంలో మరో కీలక అడుగు పడనుంది. డిసెంబర్లో చెన్నై వేదికగా బిగ్ బాష్ లీగ్ (Big Bash League) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ‘Gడే నమస్తే’ కార్యక్రమంలో భాగం కానుంది. ముంబైలో బుధవారం జరిగిన ఐసీ3 కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్లో జరిగే ‘Gడే నమస్తే’లో ఆస్ట్రేలియా సంస్కృతి, విద్య, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గత నెలలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ ఈ మ్యాచ్‌ను ప్రకటించారు.
2026-27 బీబీఎల్ సీజన్‌ను భారత్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ చారిత్రక మ్యాచ్‌కు వేదిక కానుంది. డిసెంబర్ 12న మ్యాచ్ జరగనుంది. మెల్బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో బీబీఎల్‌లో తొలిసారి ఆస్ట్రేలియా వెలుపల మ్యాచ్ జరగనుంది. మెల్బోర్న్ రెనెగేడ్స్ హోమ్ టీమ్‌గా వ్యవహరించనుంది. ఇక విద్యారంగంలోనూ భారత్‌తో ఆస్ట్రేలియా భాగస్వామ్యం కొనసాగుతోందని ఫిలిప్ గ్రీన్ తెలిపారు.
భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక రోడ్‌మ్యాప్‌లో విద్య, శిక్షణ కీలక రంగాల్లో ఒకటిగా ఉన్నాయని చెప్పారు. భారత్‌లో ఇప్పటికే 18 ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు తమ ఉనికిని చాటుతున్నాయని తెలిపారు. ఎనిమిది ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయని చెప్పారు. కొన్ని ఇప్పటికే క్యాంపస్‌లను ప్రారంభించాయని వివరించారు. క్రీడలు, విద్య, సంస్కృతి రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను మరింత బలోపేతం చేసే కార్యక్రమంగా ‘Gడే నమస్తే’ కొనసాగనుంది.

