మెదక్ రైతులను ముంచిన అకాలవర్షం

కలం, మెదక్ బ్యూరో: ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో అకాల వ‌ర్షం (Unseasonal Rain) జిల్లా రైతుల‌కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మ‌డి జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో బ‌ల‌మైన ఈదురు గాలులతోకూడిన వ‌ర్షం, కొన్ని ప్రాంతాల్లో వ‌డ‌గండ్ల వాన, మ‌రికొన్ని ప్రాంతాల్లో అకాల వ‌ర్షం రైతన్న‌ను కొలుకొని దెబ్బ‌తీసింది. సంగారెడ్డి‌ జిల్లాలో మామిడి తోట‌లకు, మెద‌క్, సిద్ధిపేట జిల్లాల్లో వరిపంటకు తీవ్ర న‌ష్టం జ‌రిగింది. ఈదురుగాలుల బీభత్సానికి, అకాల వర్షాలకు మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బ‌ల‌మైన ఈదుర‌గాలుల ప్ర‌భావంతో వేలాది ఎక‌రాల్లో మామిడి కాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, స‌దాశివ‌పేట‌, జ‌హీరాబాద్, కంది ప్రాంతాల్లో అకాల వర్షాలతో మామిడి పంట నేల రాలింది. బలమైన ఈదురుగాలుల వల్ల మామిడి తోటల్లోని పిందెలు, కాయలు నేల రాలాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మ‌లు నేలకొరిగి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మామిడి పండ్ల‌ను కోసి మార్కెట్‌కు తరలిద్దామనుకొనేలోపే ఈదురుగాలులతో కూడిన వ‌ర్షం రైత‌న్న పాలిట శాపంగా మారింది. చేతికొచ్చిన పంట గాలివానకు నేలపాలవడంతో మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మార్చిలో వ‌చ్చిన వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన రైతుల‌కు ..తాజా వ‌ర్షాలు మ‌రింత న‌ష్టంను మిగిల్చిచాయి. సీజ‌న్ టైంలోనే ఈదురుగాల‌ల కార‌ణంగా కొలుకొని దెబ్బ త‌గిలింద‌ని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో అమ్ముకొనే సమయంలో వచ్చిన వానలు తమని నిండా ముంచాయని మామిడి రైతులు వాపోతున్నారు.

వ‌రి పంట‌కు భారీనష్టం

మెదక్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వ‌ర్షాల కార‌ణం వేలాది ఎక‌రాల్లో వ‌రి పంట‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగింది. మెదక్‌ జిల్లాలోని రామాయంపేట, చేగుంట, నార్సింగి, చిన్న శంకరంపేట మండలాల్లో అక‌స్మాత్తుగా వ‌ర్షం ప‌డ‌టంతో క‌ల్లాల వ‌ద్ద, రోడ్లపైన ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. వరి కోత దశలో ఉండగా వర్షం పడటంతో పంట నేలపాలైంది. ప‌లు గ్రామాల్లో అకాల వర్షాల దెబ్బ‌కు కల్లాల్లో నుంచి వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు క‌ష్టం వర్షార్పణం అయ్యింది. సాయంత్రం వ‌ర‌కు తీవ్రమైన ఎండలు ఉండి ఒక్కసారిగా మబ్బులు కమ్మి అకాల వర్షం కురిసింది. కల్లాలు, మార్కెట్లు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం కాపాడుకునే స‌మ‌యం కుడా లేకుండా పోవ‌డంతో పంట త‌డిసిపోయింది. మెద‌క్ జిల్లాలో వ్య‌వ‌సాయ శాఖ‌ అధికారులు వ‌రి 4701 ఎక‌రాల్లో , మొక్క‌జోన్న 12 , మామిడి 63 మొత్తం 4777 ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిన‌ట్టు ప్రాథమిక అంచనాకు వ‌చ్చారు. చేగుంట, నార్సింగి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కర్నాల్‌పల్లి – మక్కరాజ్ పేట గ్రామాలలో రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. వ్య‌వ‌సాయ అధికారులు క్షేత్ర‌స్ధాయిలో ప‌ర్య‌టించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ధర్నా నిర్వహించారు. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈ అకాల వర్షాల వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఇంకా త‌ప్ప‌ని వాన‌ గండం

రాష్ట్రంలో 27 వ‌ర‌కు ఆకాలవర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉందని ఉమ్మడి మెదక్ జిల్లాలో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావ‌ర‌ణశాఖ తెలిపింది. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకు అరెంజ్, ఎల్లో అలర్ట్ ప్ర‌క‌టించింది. దీంతో రానున్న వారంపాటు త‌మ పంట‌ను ఎలా కాపాడుకోవాలో తెలియాల్సి ఉంది. నిన్న పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన కురియడంతో పండ్ల తోట‌లు, వ‌రికి ప్ర‌ధానంగా తీవ్ర నష్టం వాటిళ్లగా, మిగిలిన పంటలు కుడా కుడా దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లో కుడా వడగళ్ల వాన, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ఉన్న‌య‌ని చెప్పిన నేపథ్యంలో రైతులు త‌గిన జాగ్ర‌త్తలు తీసుకొవ‌ల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. మరోవైపు అధికారులు పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>