నాన్నకు ప్రేమతో.. తండ్రి ‘కల’ నెరవేర్చిన కొడుకు ‘కలం’..!

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) జిల్లాలో మారుమూల ప్రాంతం.. గ్రామీణ నేపథ్యం.. అక్కడి పదో తరగతి విద్యార్థి శ్రీదీప్ కు విధి పరీక్ష పెట్టింది. ఓ వైపు మొదటి రోజే తెలుగు పరీక్ష రాస్తున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే.. నదిలో నీట మునిగి తండ్రి చనిపోయాడని. ఇంట్లో వాళ్ళు టీచర్లు కూడా అతనికి తెలియనివ్వలేదు. పరీక్ష అయిపోగానే ఇంటికి తీసుకెళ్లారు. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. పుట్టెడు శోకంతో ఇంటి పెద్దగా తండ్రి అంత్యక్రియల బాధ్యతను నెరవేర్చాడు. గుండెలు బరువెక్కినా బాధను దిగమింగుకొని రెండో రోజు నుంచి మళ్ళీ పరీక్షలు రాశాడు. అయితే తాజాగా రిలీజైన పదో తరగతి ఫలితాల్లో ఆ పిల్లాడి ఫలితాలు చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. తండ్రిని కోల్పోయి పరీక్షలు రాసిన శ్రీ దీప్ మండల టాపర్ గా నిలిచి అబ్బురపరిచాడు.

కామారెడ్డి (Kamareddy) జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని చీనూరుకు చెందిన రంగీ శ్రీదీప్ పరీక్షా ఫలితాల్లో 574 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచాడు. రంగీ ఏసయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడైన శ్రీదీప్ గోపాల్ పేట మోడల్ స్కూల్ లో పదో తరగతి చదివాడు. గత నెల 14న పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయిన రోజే శ్రీదీప్ తండ్రి ఏసయ్య మండలంలోని మంజీర నదిలో ప్రమాదవశాత్తు నీటమునిగి మృత్యువాత పడ్డాడు. ఇంటికి వెళ్లి తండ్రి భౌతిక కాయం చూడగానే తండ్రి మాటలు కళ్ళల్లో తిరిగాయి. పరీక్షలు బాగా రాసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయోజకుడివి కావాలని తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి..

తండ్రి మరణించిన బాధను దింగమింగుకొని పరీక్షలకు సన్నద్ధమైన శ్రీదీప్ 574 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచి తండ్రికి అంకితం ఇచ్చాడు. మార్కుల లిస్ట్ తో తండ్రి ఫోటో ముందు నిలబడి.. నాన్నా నువ్వు కోరుకున్నట్టుగానే నేను సాధించాను అని రోదించాడు. శ్రీదీప్ ను తల్లి పద్మ హత్తుకొని పుట్టెడు దుఃఖంలో కూడా స్వీటు తినిపించింది. కొడుకు సాధించిన విజయం గురించి బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల వారికి చెబుతూ స్వీట్లు పంచింది. అంతటి బాధను కూడా దిగమింగుకుని పరీక్షలు రాసి ఇంతటి విజయాన్ని సాధించిన శ్రీ దీప్ ను ఉదాహరణగా చూపిస్తూ కష్టాలు కన్నీళ్లు అలా ఎదుర్కోవాలి.. ఆగిపోకూడదు.. తండ్రి చనిపోయినా ఆయన కలను నెరవేర్చడం కూడా ముఖ్యమే అంటూ గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆ బాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. నిజంగా ఫోన్ లకు అతుక్కుపోతున్న పిల్లల్ని చూస్తున్న నేటి సమాజంలో శ్రీ దీప్ ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు.

Read Also: టోఫు తింటేనే ఆడవారిని గౌరవించినట్లా..? నెట్టింగ్ మరో వింత థీరీ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>