కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మీడియా అకాడమీ (Telangana Media Academy) చైర్మన్ శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) పదవీకాలం రేపటితో (ఫిబ్రవరి 24) ముగియనున్నది. ఆయనకు ప్రభుత్వం ఎక్స్ టెన్షన్ ఇస్తుందా?.. వీడ్కోలు పలుకుతుందా?.. అనే సస్పెన్స్ నెలకొన్నది. ఆయన పదవీకాలాన్ని పొడిగించడంపై ప్రభుత్వ వర్గాలు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో ఆయనే కొనసాగుతారా?.. లేక కొత్త చైర్మన్ వస్తారా?.. అంటూ జర్నలిస్టుల్లో చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే శ్రీనివాసరెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ 2024 ఫిబ్రవరి 25న ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆ గడువుకు ఇంకో రోజు మాత్రమే వ్యవధి ఉన్నా ప్రభుత్వం ఆయన సర్వీసు పొడిగింపుపైనగానీ, కొత్త చైర్మన్ నియామకంపైగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అల్లం నారాయణకు మూడుసార్లు ఎక్స్ టెన్షన్ :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా (అప్పట్లో ఆ పేరుతో ఉండేది) నియమితులయ్యారు. ఫస్ట్ టైమ్ కావడంతో మూడేండ్ల పదవీకాలాన్ని ఫిక్స్ చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత రెండేండ్ల టెన్యూర్ ఖరారు చేస్తూ వరుసగా మూడుసార్లు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. దీంతో మొత్తం తొమ్మిదిన్నరేండ్ల పాటు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు రోజుల్లోనే (2023 డిసెంబరు 11న) లాంఛనంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) ఎక్స్ టెన్షన్ విషయంలో మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఇప్పటికిప్పుడు వెంటనే కొత్త చైర్మన్‌ను నియమించాలన్న ఆలోచన కూడా లేదన్నది సచివాలయ వర్గాల సమాచారం. కొత్త చైర్మన్ పోస్టు కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తొందరేమీ లేదన్న ధోరణితో ఉన్నట్లు తెలిసింది.
అక్రెడిటేషన్ల జారీ నిబంధనలపై వివాదం :
జర్నలిస్టు యూనియన్ నాయకుడే చైర్మన్ అయినందున హక్కులు, సంక్షేమం విషయంలో ఢోకా లేదన్న భావన పాత్రికేయుల్లో అప్పట్లో నెలకొన్నది. రెండేండ్లయినా జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలొచ్చాయి. పాత ప్రభుత్వం ఇచ్చిన కార్డులే ఎక్స్ టెన్షన్ పేరుతొ కొనసాగుతున్నాయి. ఇటీవలే కొత్త అక్రెడిటేషన్ల కార్డుల కోసం నిబంధనలతో కూడిన జీవో రిలీజ్ కావడం వివాదాస్పదమైంది. యూనియన్ నాయకుడిగా ఉండి కూడా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతున్నదనే ఆరోపణలు వచ్చాయి. చివరకు జర్నలిస్టులు సమాచార పౌర సంబంధాల కార్యాలయం ముందు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శన చేయక తప్పలేదు. ఇక జర్నలిస్టులకు ఇండ్లు లేదా ఇండ్ల స్థలాల విషయంలో సీఎం రేవంత్ తొలినాళ్లలో హామీలు ఇచ్చి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పజెప్పినా ఇప్పటికీ కొలిక్కి రాలేదన్న అసంతృప్తి పాత్రికేయుల్లో నెలకొన్నది.
Read Also: ఎంప్లాయీస్ vs సర్కార్.. సహనమా.. సమరమా..!
Follow Us On : WhatsApp


