కలం, వెబ్ డెస్క్ : వరంగల్ నగరంలోని కేడీసీ మైదానంలో ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ (BRS Warangal) ఆధ్వర్యంలో జన చైతన్య సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి మాట్లాడారు.
ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడించారు. కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం పార్టీ సభ మాత్రమే కాదని, నగరంలోని మేధావులు, విద్యావంతులు, వివిధ పార్టీల నేతలు, యువత స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే ప్రజా చైతన్య సభగా నిలుస్తుందని వినయ్ భాస్కర్ తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ నాయకులు ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉందని నరేందర్ పేర్కొన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ పూర్వవైభవం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

