కలం, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పండగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనుమానాస్పద స్థితిలో మృతి (Techies Found Dead) చెందారు. ఈ సంఘటన కంబంవారిపల్లె మండలం బండ్ల వడ్డిపల్లిలో జరిగింది. స్థానికులు, కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మణి(35), పుష్పరాజ్(27) మరో నలుగురు యువకులు కలసి శనివారం మద్యం తాగడానికి ఊరి చివరకు వెళ్లారు. ఈ క్రమంలో కాసేపటికి మణి, పుష్పరాజ్ అస్వస్థతకు గురయ్యారు. స్నేహితులు వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పీలేరులోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అయితే, అప్పటికే వాళ్లు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ యువకుల కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా, మణి చెన్నైలో, పుష్పరాజ్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మణికి పెళ్లై, భార్య, కుమారుడు ఉండగా, పుష్పరాజ్‌కు పెళ్లి కాలేదు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల (Techies Found Dead) మరణానికి కారణం.. మద్యంలో ఏదైనా కలసిందా? లేకపోతే మరేదైనానా అనేది పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


