కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నారాయణగూడ (Narayanguda) పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిన్న తర్వాత ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం అక్క భువనేశ్వరి (17) మరణించగా, మంగళవారం చెల్లెలు సంధ్య (10) చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి విఠల్‌వాడిలో నివాసం ఉంటున్నారు.
ఇటీవల వారి బంధువైన రేణుక వీరి ఇంటికి వస్తూ నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేశారు. ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు ఆమె నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం సాయంత్రం పండ్లు తిన్న తర్వాత ఐదుగురికీ ఒకేసారి వాంతులు, విరేచనాలు ప్రారంభం కావడంతో కాచిగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం భువనేశ్వరి, మంగళవారం సంధ్య మృతి చెందారు. సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనకు పండ్లను మగ్గబెట్టడానికి వాడే రసాయనాలే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో పండ్లు త్వరగా పక్వానికి రావడానికి విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నారని, ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం తాము ఎలాంటి రసాయనాలు కలపడం లేదని చెబుతున్నారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు వేరే కారణాలు కూడా ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. వారు తిన్న ఇతర ఆహార పదార్థాల గురించి కూడా ఆరా తీశారు. పిల్లల మృతికి కేవలం మామిడి పండ్లు మాత్రమే కారణం కాకపోవచ్చని నారాయణగూడ సీఐ సైదేశ్వర్ అభిప్రాయపడ్డారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఫుడ్, ఫ్రూట్ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

