నార్కట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి (Narketpally) ఫ్లైఓవర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మోజో ట్రావెల్స్ కు చెందిన బస్సు ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఓ లారీని స్వల్పంగా ఢీకొట్టింది.

ఈ విషయంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్‌ల మధ్య రోడ్డుపైనే వాగ్వాదం మొదలైంది. దీంతో బస్సు డ్రైవర్ తనకు మద్దతుగా అదే సమయంలో వెళ్తున్న మరో ట్రావెల్స్ డ్రైవర్‌ను అక్కడికి పిలిపించుకున్నాడు. బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య, క్లీనర్ సురేశ్ లు కలిసి నిలిపి ఉన్న వాహనాల మధ్య నిలబడి లారీ డ్రైవర్‌తో చర్చిస్తున్నారు. వీరు మాట్లాడుకుంటుండగా, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన మరో లారీ.. ఆగి ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో వాహనాల మధ్యలో ఉన్న డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యలు నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్లీనర్ సురేశ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్‌ను చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. జాతీయ రహదారిపై నిలిచిపోయిన భారీ ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>