కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ ( TVK Bypoll) తన స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఈ కౌంటింగ్ ప్రక్రియలో టీవీకే స్వల్ప లీడ్ సాధించినప్పటికీ, ఈవీఎం ఓట్ల లెక్కింపు పెరిగేకొద్దీ రెండు నియోజకవర్గాల్లోనూ పూర్తి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మధురాంతకంలో మొదటి రౌండ్ నుంచే టీవీకే అభ్యర్థి కే. మరకతం కుమారవేల్ తమ సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థిపై వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉండగా, ధరాపురంలో ప్రారంభ రౌండ్లలో అన్నాడీఎంకే అభ్యర్థి కే. భానుమతి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఐదో రౌండ్ తర్వాత టీవీకే అభ్యర్థి పి. సత్యభామ పుంజుకుని స్పష్టమైన లీడ్ సాధించారు. గతంలో అన్నాడీఎంకే తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి, రాజీనామా చేసి టీవీకేలో చేరిన నేతలే మళ్లీ బరిలోకి దిగడం వల్ల ఈ రెండు స్థానాల్లో పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన వివిధ శాసనసభ, లోక్‌సభ స్థానాల బైపోల్స్ లెక్కింపు ఫలితాలు ఆసక్తికర ధోరణిని చూపుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని రెంజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాన్ని కనబరుస్తుండగా, అస్సాంలోని నాగావ్ లోక్‌సభ ఉపఎన్నికలోనూ అధికార బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. అదేవిధంగా పుదుచ్చేరిలోని తట్టన్ చావడి అసెంబ్లీ స్థానంలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

