జర్నలిస్టుల రక్షణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి : TUWJ-IJU

కలం, వనపర్తి: జర్నలిస్టుల రక్షణ, హక్కులు, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) (TUWJ-IJU) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్థానంలో సమగ్ర అధికారాలతో మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఐజేయూ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వనపర్తి (Wanaparthy) గాంధీ చౌక్‌లో జిల్లా అధ్యక్షుడు డి.మాధవరావు ఆధ్వర్యంలో, జిల్లా కార్యదర్శి బి.రాజు, పట్టణ అధ్యక్షులు తైలం అరుణ్ రాజ్ అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు నిరంతరం పనిచేస్తున్నారని, విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధుగౌడ్ అన్నారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల హామీలను అమలు చేయాలని కోరారు. ఇటీవల అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేసినప్పటికీ వాటిని హెల్త్‌ కార్డులతో అనుసంధానం చేయలేదన్నారు. ప్రతి జర్నలిస్టుకు హెల్త్‌ కార్డు అందించి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్‌ వైద్య సేవలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.

జర్నలిస్టుల హక్కులు పరిరక్షించాలి :

TUWJ-IJU జిల్లా అధ్యక్షుడు డి.మాధవరావు మాట్లాడుతూ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ కీలకమని, జర్నలిస్టులు భయాందోళనలు లేకుండా విధులు నిర్వహించే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలని కోరారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా రంగాల్లోని సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నూతన మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని కోరారు.

నూతన వేజ్‌బోర్డు ఏర్పాటు చేయాలి :

జిల్లా కార్యదర్శి బి.రాజు మాట్లాడుతూ జర్నలిస్టులు, జర్నలిస్టేతర మీడియా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన వేజ్‌బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత, వేతనాలు, పని పరిస్థితులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు మంజూరు చేయడంతోపాటు హెల్త్‌ కార్డులు అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం యూనియన్‌ నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి, ఆర్డీవో సుబ్రహ్మణ్యంకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు శ్రీనివాసులు, జిల్లా ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్‌, కార్యదర్శి నరసింహరాజు, పట్టణ అధ్యక్షుడు తైలం అరుణ్‌రాజ్‌, కార్యదర్శి అంజి,  జిల్లా నాయకులు బాలస్వామి, రాములు, వెంకట్‌గౌడ్‌, మన్యం, నాకొండ యాదవ్‌, విజయ్‌, పికిలి రాము, రవికాంత్‌, కమల్‌ రెహ్మాన్‌, నస్రుద్దీన్‌, వహీద్‌, ఫారూఖ్‌ పటేల్‌, పరశురాముడు, బాలరాజు, ధనుష్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాల ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు, జర్నలిస్టులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>