కరీంనగర్ జైలులో గాంధీ జయంతి.. ఖైదీలకు కీలక సూచనలు

కలం, కరీంనగర్ :  కరీంనగర్ జిల్లా జైలు(Karimnagar District Jail) ఆవరణలో మహాత్మా గాంధీ జయంతిని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా (Prisoners Welfare Day) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్. శివకుమార్ అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాసరెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రీహరి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. రాజ్ గోపాల్ రావు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన గీతంతో వేడుకలను ప్రారంభించారు.

జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి విజయ్ డేని వార్షిక నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శివకుమార్ మాట్లాడుతూ.. గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా జరుపుకుంటున్నామని తెలిపారు. ఇద్దరు మహానుభావులు దేశానికి సత్యం, సరళత, నిష్కపటత వంటి గొప్ప విలువలను గుర్తుచేస్తూ నిలిచారని అన్నారు. వ్యక్తి క్షణికావేశంలో చేసిన తప్పు అతని జీవితానికి శాశ్వత ముద్రగా మిగలకూడదని, ఆ తప్పు నుంచి బయటపడి జైలు జీవితంలో నేర్చుకున్న అనుభవాలు, విలువలు, జ్ఞానంతో విడుదల అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైలు సిబ్బంది చేస్తున్న ప్రతి ప్రయత్నం అభినందనీయమన్నారు. జైలు జీవితం ఒక ముగింపు కాదని, మార్పుకు ఆరంభం కావాలని సూచించారు. గతంలో చేసిన తప్పుల కారణంగా కుటుంబ సభ్యులు బాధపడే వ్యక్తిగా కాకుండా, తమలో వచ్చిన మార్పును చూసి కుటుంబం గర్వపడే వ్యక్తిగా జైలు నుంచి బయటకు రావాలని ఖైదీలకు పిలుపునిచ్చారు.

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం మాట్లాడుతూ.. ఖైదీలను సంస్కరించేందుకు జైలు శాఖ అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. పెరోల్, ఫర్లో, రిమిషన్ వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విడుదల అనంతరం మార్పు చెందిన పౌరులుగా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యవేక్షణ అధికారి విజయ్ డేని, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ శేష శైలజ, డాక్టర్ రఘురాం, అడ్వకేట్ టి. మహేష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జైలర్లు జీ. లక్ష్మీనారాయణ, భాష బోయిన రమేష్, డిప్యూటీ జైలర్లు సుధాకర్ రెడ్డి, అనిల్ కుమార్, ఎస్. అజయ్ చారి, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>