కలం, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తుని (Tuni) లో వింత చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ ఓ స్వీట్ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగ, అక్కడ చేసిన పని చూసి యజమానులు, పోలీసులు సైతం అవాక్కయ్యారు. షాపులోని మిఠాయిలను ఆరగిస్తూ నగదు దొంగిలించిన ఈ స్వీట్ దొంగ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తునిలోని బొంబాయి స్వీట్స్ దుకాణంలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ కంగారు పడకుండా హాయిగా అక్కడ ఉన్న మిఠాయిలను తింటూ చోరీ (Sweet Shop Theft) కి పాల్పడ్డాడు. మిఠాయిలు తింటున్న సమయంలో దుకాణంలో ఉన్న సీసీ కెమెరాను గమనించిన దొంగ వెంటనే అలర్ట్ అయ్యి ఆ కెమెరా కనెక్షన్‌ను కట్ చేశాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న సుమారు రూ.4 వేల నగదును దొంగిలించినట్లు యజమాని వెల్లడించాడు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా వైర్లు కట్ చేయడానికి ముందు నమోదైన విజువల్స్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

