కలం, వెబ్ డెస్క్ : దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని రవాణా ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి (Dasara Rush). దసరా వేడుకలను కుటుంబసభ్యులతో కలసి జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుండటంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS) సహా ప్రధాన బస్టాండ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, వరంగల్, కరీంనగర్ వంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్గాల్లో వెళ్లే బస్సులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.
బస్టాండ్లతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ అదే స్థాయిలో రద్దీ కనిపిస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫారమ్‌లు, టికెట్ కౌంటర్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల వైపు వెళ్లే రెగ్యులర్ రైళ్లన్నీ ముందస్తుగానే హౌస్‌ఫుల్ కావడంతో సాధారణ బోగీలు, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీ అధికమైంది.
ఈ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC), ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సంస్థలు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చాయి. దక్షిణ మధ్య రైల్వే కూడా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అదనపు భద్రత, తాగునీరు, తాత్కాలిక షెల్టర్లు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

