కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) గుడ్ న్యూస్ చెప్పారు. మొక్కజొన్న పంట కొనుగోలుకు అదనపు కేంద్రాలు (maize procurement) పెట్టాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మక్క రైతులు భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200 కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయి. సేకరించిన మొక్కజొన్నను గోదాములకు వేగంగా తరలించాలని మార్క్‌ఫెడ్ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి. తమ పంటను అమ్మెందుకు రైతులు ఒక్కసారిగా భారీ ఎత్తున కేంద్రాలకు రావడంతో రద్దీ నెలకొంది. పలుచోట్ల రైతులు బారులు తీరారు.
ఈ తరుణంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా మంత్రి చొరవ తీసుకున్నారు. రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయకుండా ఉండేందుకు వీలుగా ఎక్కడికక్కడ అదనంగా కొత్త కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. రైతుల సౌకర్యార్థం అవసరమైన చోటల్లా తక్షణమే కొనుగోలు కేంద్రాలను విస్తరించడం ద్వారా కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతంచేయవచ్చని సూచించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన పంటను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే గోదాములకు తరలించాలని మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులను ఆయన గట్టిగా ఆదేశించారు. రానున్న రోజుల్లో అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నందున, ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట వానపాలు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ తో రాష్ట్ర వ్యవసాయ శాఖ కదిలింది. రాష్ట్రంలోని పలుచోట్ల మొక్కజొన్న రైతులు ధర్నా చేపట్టారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో రహదారిపై బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేయాలని, పంటలకు మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. మరోవైపు పెద్ద కొడపగల్‌లోనూ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు. జొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలన్నారు. ఖమ్మం జిల్లాలో సైతం మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. తమ పంటను ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు.

