కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ‘వన్ సైడ్’ షోతో గుజరాత్ టైటాన్స్‌ను సొంతగడ్డపైనే మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలినా, యువ సంచలనం తిలక్ వర్మ (101)* అసాధారణ సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడిన తిలక్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్, ముంబై పేసర్ అశ్వని కుమార్ (4/24) ధాటికి క్యూ కట్టింది. కేవలం 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేక 100 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. చాలా కాలం తర్వాత బుమ్రా వికెట్ల ఖాతా తెరవగా, సాంట్నర్ రెండు కీలక వికెట్లతో గుజరాత్ వెన్ను విరిచాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (13), డానిష్ మలేవార్ (2) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, నమన్ ధీర్ (45 పరుగులు, 32 బంతుల్లో) ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ (15), హార్దిక్ పాండ్యా (15) తక్కువ స్కోర్లకే పరిమితమైనా, తిలక్ వర్మ (101 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ 1 పరుగుతో అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో కాగిసో రబడ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ముంబై బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. 15.4 ఓవర్లకే 9 వికెట్లు కోల్పోయి కేవలం 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (0) గోల్డెన్ డకౌట్ కాగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (14), జోస్ బట్లర్ (5) నిరాశపరిచారు. వాషింగ్టన్ సుందర్ (26) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షారుఖ్ ఖాన్ (17), రబడ (12) రెండంకెల స్కోరు చేయగలిగారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 4 వికెట్లతో చెలరేగగా, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు, బుమ్రా, హార్దిక్ పాండ్యా, గజన్‌ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

