కలం, తెలంగాణ బ్యూరో: కేంద్రప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా, తెలంగాణ (Telangana) రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. కేంద్రం విత్తన చట్టాన్ని (Seed Law) ఆమోదిస్తే దానికి అనుగుణంగా అమలు చర్యలు చేపడతామని తెలిపారు. కేంద్రం నుంచి అనుమతి లభించకపోయినా రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వమే బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేస్తామని వివరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో విత్తన చట్టం-2025పై మంత్రి తుమ్మల సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి ఇప్పటికే ప్రత్యేక విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
రైతులు, విత్తన కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లు, డీలర్లు, పంపిణీదారులు, వ్యవసాయ అధికారులు వంటి వర్గాలతో కమిటీ సంప్రదింపులు జరిపి విత్తన రంగానికి సంబంధించిన అంశాలను స్టడీ చేసిందని చెప్పారు. వచ్చే పంటకాలానికైనా రైతులకు ప్రయోజనం చేకూరేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సూచనల మేరకు చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్న సమయంలో కేంద్రం విత్తన చట్టం-2025 ముసాయిదాను రూపొందించిందన్నారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను ఇప్పటికే కేంద్రానికి పంపిందని వెల్లడించారు. రాష్ట్రం తన అభిప్రాయాలు పంపి నెలలు గడిచినా కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ముందడుగు పడలేదని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విత్తన చట్టాన్ని త్వరగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినట్లు పెర్కొన్నారు.
‘సీడ్ బౌల్’కు బలమైన చట్టం
దేశంలోనే తెలంగాణ ప్రముఖ విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా, ‘ దేశ విత్తన భాండాగారం’గా గుర్తింపు పొందిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇంత కీలకమైన రంగానికి బలమైన, సమగ్ర చట్టపరమైన వ్యవస్థ అవసరమన్నారు. రాష్ట్ర విత్తన బిల్లు డ్రాఫ్ట్ కమిటీ సూచనలు, రైతుల ప్రయోజనాలు, ప్రస్తుత విత్తన రంగ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర చట్టాన్ని రూపొందించి కేంద్రానికి పంపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, విత్తన ఉత్పత్తి రైతులకు న్యాయం చేయడం, నకిలీ విత్తనాలను అరికట్టడం, పంట నష్టానికి పరిహారం అందించడం సమగ్ర విత్తన చట్టం ప్రధాన లక్ష్యాలని తుమ్మల తెలిపారు. విత్తన ధరలు, మార్కెట్‌పై నియంత్రణ, విత్తన రంగంలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించడంపైనా చట్టంలో దృష్టి సారించనున్నట్లు చెప్పారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా రాష్ట్ర విత్తన రంగానికి బలమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

