కలం, వెబ్‌డెస్క్: దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టడం హిందుత్వం కాదని, భారత్‌తో ముస్లింలు ఉండొద్దనే వారు హిందువులు కూడా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ‘వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ’ సదస్సులో మోహన్ భగవత్ పాల్గొని మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే భారత్ కర్తవ్యమని పేర్కొన్నారు. దీనిని కేవలం మాటల ద్వారా కాకుండా ఆచరించి చూపించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
దేశాలు కేవలం భౌగోళిక ప్రాంతాలు కాదని, వాటికంటూ ఒక నిర్దిష్టమైన బాధ్యత, గమ్యం ఉంటాయని చెప్పిన స్వామి వివేకానంద వ్యాఖ్యలను మోహన్ భగవత్ గుర్తు చేశారు. వైవిధ్యాల కలయిక, ఐక్యత భారత్ డీఎన్ఏలోనే ఉందని చెప్పారు. భారతీయులంతా ఒకే దారంలో అల్లిన పూసల వంటి వారని మోహన్ భగవత్ అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీతో పాటు పలు పౌర హక్కుల సంఘాలు నిరసనలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తాము ఉంటున్న అమెరికా దేశం పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించాలని, భారత్ నుంచి నేర్చుకున్న విలువల ప్రకారం జీవించాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

