కలం, ఢిల్లీ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. అన్ని రంగాల్లో విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీని దేశ రక్షణ, భద్రతా అవసరాలకు వాడుకోవడంపై కసరత్తు జరుగుతున్నది. ఇందుకు అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) తయారు చేయడంపైనా సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకూ నేరం జరిగిన తర్వాత దానిపై దర్యాప్తు ప్రారంభించే సంప్రదాయ పోలీసింగ్ నమూనా స్థానంలో ఇకపైన ‘ఇంటెలిజెన్స్ లెడ్ పోలీసింగ్’ (AI Policing) మెకానిజం రాబోతున్నది. ప్రస్తుతం సీసీటీఎన్ఎస్, ఐసీజేఎస్, నాట్‌గ్రిడ్, ఎన్ఏఎఫ్ఐఎస్ తదితర పలు విభాగాల నుంచి హోంశాఖకు సమాచారం అందుతున్నది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఆ ఇన్ఫర్మేషన్‌ను ఏఐ ద్వారా విశ్లేషించి భవిష్యత్తులో ‘ప్రెడిక్టివ్ ఇంటెలిజెన్స్’ విధానం అమలు చేయాలన్నది హోంశాఖ భావన. హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన తొమ్మిదవ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో ఇకపైన అనుసరించబోయే పోలీసింగ్, ఇంటెలిజెన్స్ సమాచారంపై ప్రత్యేక సూచనలు చేశారు.
అన్ని విభాగాల మధ్య పటిష్ట సమన్వయం
– ఒకప్పుడు ఉగ్రవాదం, సరిహద్దు నుంచి అక్రమ చొరబాట్లు, వామపక్ష తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు దేశ భద్రతా వ్యవస్థకు పెను సవాళ్లుగా ఉండేవని.. కానీ ఇప్పుడు సైబర్ దాడులు, ఆన్‌లైన్ రాడికలైజేషన్, సోషల్ మీడియా ద్వారా తీవ్రవాద ప్రచారం, సరిహద్దు దాటి పనిచేసే నేర ముఠాలు, నకిలీ గుర్తింపు కార్డులు, డిజిటల్ ఆర్థికి లావాదేవీల ద్వారా ఫండ్స్ ట్రాన్సఫర్, మానవ అక్రమ రవాణా.. ఇలాంటివి పెరిగాయన్నది హోంశాఖ అధికారుల విశ్లేషణ.
– నేరాల స్వభావం మారిపోవడంతో సమాచార సేకరణతో పాటు వివిధ అవసరాలకు పనిచేస్తున్న వేదికలను ఏఐ విశ్లేషణకు సమన్వయించుకోవడంపై హోంశాఖ దృష్టి పెట్టింది.
– దేశవ్యాప్తంగా ఎఫ్ఐఆర్‌ల నమోదు, పోలీస్స్టేషన్ల నెట్‌వర్క్ కోసం వాడుతున్న సీసీటీఎన్ఎస్, న్యాయస్థానాలు-జైళ్ళు-పోలీసులను అనుసంధానించే ఐసీజేఎస్, కమ్యూనికేషన్ రికార్డుల కోసం ఏర్పడిన నేషనల్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్), నేషనల్ ఆటోమేటెడ్ వేలిముద్రల గుర్తింపు విభాగం (ఎన్ఏఎఫ్ఐఎస్).. ఇలాంటివాటితో పాటు మల్టీ ఏజెన్సీల ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ విశ్లేషణ, సమన్వయం ఈ కొత్త మెకానిజంలో కీలకం కానున్నది.
డేటా ఆధారిత నియంత్రణ వ్యవస్థ
– ఒకే తరహా నేరాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రా,తానికి ఈ కార్యకలాపాలు ఎలా విస్తరిస్తున్నాయి.. వేర్వేరు కేసుల్లో ఉన్న వ్యక్తులు లేదా సంస్థల మధ్య కంటికి కనిపించని సంబంధాలేంటి.. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల విస్తరణ ఎలాంటి ముసుగు రూపాల్లో రాష్ట్రాల హద్దులు దాటి విస్తరిస్తున్నది.. ఇలాంటివన్నీ కొత్త మెకానిజంలో ఏఐ ద్వారా విశ్లేషించి డేటాను నిక్షిప్తం చేయడానికి హోంశాఖకు వీలు కలుగుతుంది.
– ముప్పు వచ్చిన తర్వాత మేలుకోడానికి బదులు ముందుగానే వివిధ విభాగాల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి పక్కగా సమన్వయంతో నివారించడం కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది.
– ఏదేని నిర్దిష్ట నేరంలో ఒక వ్యక్తి ఆనవాళ్లు ఉన్నా మిగిలిన నేరాల్లో వారి ప్రమేయాన్ని మాన్యువల్‌గా పరిశీలించడానికి బదులు ఏఐ టెక్నాలజీ ద్వారా అన్నింటినీ ఒకేసారి విశ్లేషించడమే కొత్త మెకానిజం ప్రధాన టాస్క్.
– ఇప్పటి వరకు విభాగాలు, రాష్ట్రాల సరిహద్దు సమస్యలు ఉన్నా ఇకపైన ఇంటెలిజెన్స్ లీడ్ పోలీసింగ్ పకడ్బందీ అమలుకు ఈ డేటా కీలకం కానున్నది.
దేశ భద్రతకు స్టాండరడ్ ఆపరేటింగ్ ప్రొసీజర్
దేశ భద్రత, రక్షణ అవసరాల కోసం ఇకపైన కొత్త తరహాలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రాబోతున్నాయి. కేంద్ర హోం మంత్రి ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటెజీ సదస్సులో ఈ మేరకు అధికారులకు ఎస్ఓపీ రూపకల్పనపై ఆదేశాలు జారీచేశారు. సరిహద్దులు దాటి దేశంలోకి వస్తున్న అక్రమ చొరబాట్లు, డ్రోన్ల వినియోగం, సైబర్ దాడులు, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ లాంటి సంక్లిష్టమైన సవాళ్లతో పాటు భద్రతా సంస్థల వద్ద ఉన్న సమాచారాన్ని ఒకే వేదికపై తీసుకొచ్చి విశ్లేషించడం వీలవుతుంది. ఏదైనా ఉగ్ర కుట్ర లేదా నేరం జరిగిన తర్వాత స్పందించేబదులు ముందుగానే సమాచారాన్ని అంచనా వేసి నిరోధించే వ్యవస్థపై దృష్టిపెట్టింది. ఇప్పటిదాకా వేర్వేరుగా పనిచేస్తున్న ఆరు భద్రతా విభాగాల డేటాబేస్‌ను ఏఐ ద్వారా ఒకే తాటిపైకి తీసుకురావాలన్నది హోంశాఖ ఉద్దేశం. లక్షలాది డిజిటల్ రికార్డులు, వేలిముద్రలు, ఆర్థిక లావాదేవీల డేటాను ఏఐ ద్వారా క్షణాల్లోనే విశ్లేషించి అనుమానాస్పద కదలికలు, నేరస్తుల నెట్‌వర్క్ ను ముందుగానే గుర్తించవచ్చన్నది హోంశాఖ అభిప్రాయం.
రూరల్ టు నేషనల్.. ఒకే ప్లాట్‌ఫామ్
– క్రైమ్ డేటా వివరాలను రాష్ట్రాలు, కేంద్రం పరస్పరం షేర్ చేసుకోడానికి నేట్‌గ్రిడ్, సీసీటీఎన్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తున్నా చాలా విషయాల్లో ఇంకా విడివిడి పనితీరే ఉన్నదని, దీంతో నేరాల విశ్లేషణకు చాలా సమయం పడుతున్నదనేది హోంశాఖ అధికారుల భావన.
– దీంతో రూరల్ పోలీస్ స్టేషన్ మొదలు జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం వరకు ఒకే తరహా టెక్నికల్ నెట్‌వర్క్ ఏర్పడనున్నది. ఒకవైపు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూనే ఆ విశ్లేషణను అవసరమైన ఫార్మాట్లలోకి మార్చుకోడానికి, రాష్ట్రాల మధ్య షేర్ చేసుకోడానికి యంగ్ పోలీస్, ఇంటెలిజెన్స్, ఐపీఎస్ ఆఫీసర్లను వాడాలన్నది కేంద్ర హోంశాఖ అభిప్రాయం.
– సంప్రదాయ ఉగ్రవాదం, రాడికలైజేషన్ సమస్యలతో పాటు సైబర్ థ్రెట్స్, డిజిటల్ క్రైమ్స్, ఇంటర్నేషనల్ లింక్స్, నెట్‌వర్క్ తదితరాలను సమగ్ర దృష్టితో చూడాలన్న ఆలోచనతోనే హోంశాఖ డేటా బేస్ ఇంటెలిజెన్స్ మెకానిజానికి శ్రీకారం చుడుతున్నది.
– ఈ డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ముప్పు తలెత్తనున్న రాష్ట్రాల్లోని పోలీసు వ్యవస్థను అలర్ట్ చేసి నివారించడం ప్రధాన లక్ష్యం.

