కలం, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో యువతను వేధిస్తున్న చర్మ సమస్యలలో ప్రధానమైనవి మొటిమలు, మచ్చలు. ముఖంపై ఏర్పడే ఈ మొటిమలు, నల్లమచ్చల వల్ల ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. వీటిని తగ్గించుకోవడానికి యువత రకరకాల చిట్కాలు, ఫేస్ ప్యాక్‌లు ట్రై చేస్తుంటారు. ఖరీదైన క్రీములు వాడుతుంటారు. వాటి అవసరం లేకుండా మన పెరట్లో దొరికే తులసి (Tulasi) తో మొటిమలు, నల్లమచ్చలు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ సంప్రదాయంలో తులసి ఎంతో పవిత్రమైన మొక్క. పూర్వ కాలం నుంచే దీనిని సంప్రదాయ వైద్యం, ఆరోగ్య సంరక్షణలో కూడా ఉపయోగించేవారు. అయితే సౌందర్య సంరక్షణలోనూ తులసి మొక్క ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులతో తయారు చేసుకునే కొన్ని ఫేస్ ప్యాకులు (Tulasi Face Pack) మొటిమలు, నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయిని సూచించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మన చర్మ సంరక్షణకు సహాయపడతాయి. చర్మానికి ఇన్‌స్టంట్ గ్లో ఇవ్వడానికి తులసిలోని ఔషధ గుణాలు సహాయపడతాయి. IJPI అధ్యయనం ప్రకారం.. మొటిమలు, అధిక జిడ్డు, చర్మం పేరుకుపోయే ట్యాన్ వంటి సమస్యలను నివారించడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుందట. దీని కొన్ని రకాల ఫేస్ ప్యాక్‌లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చుని చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
తులసి, పాలు ఫేస్ ప్యాక్
మొటిమల సమస్యతో బాధపడే వారికి, జిడ్డు చర్మం ఉన్నవారికి తులసి, పాలు ఫేస్ ప్యాక్ అద్భుతంగా తయారు చేస్తుందని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. దీనికోసం ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ తులసి పొడి తీసుకోవాలి. దీనిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు పాలు వేసి మిశ్రమంలా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, జిడ్డు చర్మం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
వేప, తులసి ఫేస్ ప్యాక్
మొటిమలు, మచ్చలు, నిర్జీవమైన చర్మంతో బాధపడేవారికి వేప, తులసి ఫేస్ ప్యాక్ ఎంతో సహాయపడుతుందట. ఈ ప్యాక్ ను తయారుచేసుకోవడానికి ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల తులసి పొడి తీసుకోవాలి, ఈ పొడిలో వేప ఆకులు కలపి మెత్తని పేస్ట్ లా చేయాలి. తర్వాత 2 లవంగాలను వేసి మళ్లీ పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుందని చెబుతున్నారు.
తులసి, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్
చర్మంలోని అధిక నూనెను పీల్చుకుని చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో తులసి, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ ఫేస్ ప్యాక్ ను తయారీ కోసం ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ తులసి పొడి తీసుకోవాలి. దీనికి మరో టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, 4 నుంచి 5 చుక్కల రోజ్ వాటర్ వేసి మిశ్రమంలా చేసుకోవాలి. అవసమైతే కొన్ని వాటర్ కలుపుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా, సున్నితంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.

