కలం, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా (Australia)లో ఓ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇంట్లో జరిగిన చిన్న పొరపాటుకు రూ.1.3 లక్షల భారీ జరిమానా కట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన వామికా అనే యువతి ఆస్ట్రేలియాలో చదువుకుంటోంది. ఆమె ఇంట్లో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆపేసింది. వేడి నీళ్ల ఆవిరి కాస్తా బాత్ రూమ్ బయట ఉన్న స్మోక్ డిటెక్టర్‌ను పూర్తిగా కప్పేసింది. దాన్ని పొగగా భావించిన స్మోక్ డిటెక్టర్ ఫైర్ అలారాన్ని మోగించింది. దీంతో క్షణాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో సహా అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం వేడి నీళ్ల ఆవిరి కారణంగానే అలారం మోగిందని నిర్ధారించుకున్నారు.
అనంతరం అక్కడి నిబంధనల ప్రకారం ఫైర్ అలారం అనవసరంగా మోగడానికి కారణమైందంటూ వామికాకు అధికారులు ఏకంగా 1800 ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానా విధించారు. ఈ నగదు మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.1.3 లక్షలు ఉంటుంది. దీంతో ఆ యువతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని సోషల్ మీడియాలో ఓ వీడియో రూపంలో పోస్టు చేసింది. ఆస్ట్రేలియాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయి, తన అనుభవం వివరిస్తూ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

