Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వ బడుల మూసివేత ఆలోచన విరమించుకోవాలి: టీఎస్ యూటీఎఫ్

కలం, నల్లగొండ: ఉపాధ్యాయ, విద్యారంగ హామీలను వెంటనే నెరవేర్చాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనలను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్ యూటీఎఫ్ (TS UTF) డిమాండ్ చేసింది. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ (TS UTF) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అశాస్త్రీయంగా ఉన్న జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. బడులను మూసివేయడం ఆపి, అవసరమైన చోట నూతన పాఠశాలలను తెరవాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి, ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

ఒకవేళ పరీక్ష నిర్వహిస్తే సర్వీస్ ఉపాధ్యాయులకు వెయిటేజీ ఇస్తూ.. ఆఫ్‌లైన్ విధానంలో, వారు బోధించే సబ్జెక్టులోనే పరీక్ష పెట్టాలని స్పష్టం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ రిపోర్టును తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, ఉద్యోగులందరికీ జూన్ చివరి నాటికి హెల్త్ కార్డులను అందజేయాలని కోరారు.

జిల్లావ్యాప్తంగా చేపట్టే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కేవలం విద్యార్థుల అవసరాల మేరకే జరగాలని హితవు పలికారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసా చారి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, నల్ల నరసింహ, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి, ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, జి. అరుణ, కోశాధికారి వడ్త్య రాజు, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, రమాదేవి, నలపరాజు వెంకన్న, యాదగిరి, చిన వెంకన్న, కొమర్రాజు సైదులు, గంటల వెంకట్, భాను ప్రకాశ్, నరసింహమూర్తి, వరలక్ష్మి, సురేందర్ రెడ్డి, వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>